జన్ జాతీయ గౌరవ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిర్మల్ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్న అధికారులు, ఆదివాసీ నాయకులు
నిర్మల్చైన్గేట్: స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండాను ప్రేరణగా తీసుకొని భారతీయులంతా ‘వికసిత్ భారత్’ వైపు అడుగులు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిర్సా ముండా జయంతి పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ‘జన్ జాతీయ గౌరవ దివస్’ వేడుకల్లో భాగంగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ నుంచి అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు వర్చువల్గా పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతూ బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ దివస్’గా నిర్వహించడం ద్వారా ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పెంపొందించామన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంతోపాటు ఆదివాసీల హక్కుల సాధన కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.
కలెక్టరేట్లో నివాళి..
వర్చువల్ కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బిర్సా ముండా చిత్రపటానికి అధికారులు, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీవో) నిహారిక మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ‘ఉల్గులాన్’ పేరుతో సాయుధ ఉద్యమాన్ని చేపట్టిన మహనీయుడు బిర్సా ముండా అని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి పోరాటయోధుల జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు.అనంతరం పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి అధికారులు నిరంతరం తోడ్పాటు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఏసీఎంవో శివాజీ, ఆదివాసీ సంఘాల నాయకులు సుంకరి ముత్యం, తొడసం గోవర్ధన్, నైకం భీమ్ రావ్, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


