ముంపు సమస్యను ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విఠల్‌రెడ్డి త్వరలో అధికారులతో సమావేశం నిర్వహిస్తానన్న జూపల్లి శాశ్వత పునరావాసంపై బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు
భైంసా/భైంసారూరల్: భైంసా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండేగాం వాసుల పునరావాస సమస్య మరోసారి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదివారం బాసరలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కలిసి గ్రామస్తుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుండేగాం ప్రజలు దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని, ముంపు సర్వే పూర్తయినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని వినతిపత్రం సమర్పించారు. స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గుండేగాం పునరావాస అంశంపై సమగ్రంగా చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తుల్లో మరోసారి ఆశలు మొలకెత్తాయి.
మూడేళ్లగా
తాత్కాలిక జీవనం..
మూడేళ్ల నుంచి గ్రామంలో నివసించడం సాధ్యం కాకపోవడంతో అనేక కుటుంబాలు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నాయి. స్వగ్రామాన్ని వదిలి జీవనం సాగిస్తున్నప్పటికీ తమ భూములు, వ్యవసా యం, పశుసంపద, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. తాత్కాలిక నివాసం సమస్యకు పరిష్కారం కాదని, శాశ్వత పునరావాసం కావాలని బాధితులు కోరుతున్నారు.
ప్రాజెక్టు, పునరావాసం రెండూ అసంపూర్తి..
పునరావాసం పూర్తి కాకపోవడంతో ఒకవైపు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామస్తులు తమ గ్రామంలో ప్రశాంతంగా జీవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరకపోగా, ప్రజలు కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక పునరావాస అంశం ప్రతీ ఎన్నికల సమయంలో ప్రధాన చర్చగా మారినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అధికార, ప్రతిపక్ష నాయకులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అనేకసార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందన రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీతో ఈసారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గుండేగాం గ్రామం
ఏళ్ల నుంచి అదే సమస్య..
గ్రామం : గుండేగాం
కుటుంబాలు : 162
జనాభా : 694
రేషన్ కార్డులు : 236
సాగు భూములు: 364 ఎకరాలు
ప్రధాన సమస్య : పల్లికర్ రంగారావు
ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ ఊరిలోకి రావడం,
ఏటా గుండేగాం నీటమునగడం.
పరిష్కారం : బైంసా సమీపంలోని కమ
లాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం
ఏర్పాటు చేయడం.
వర్షాకాలం ప్రారంభమవడంతో గుండేగాం గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే గ్రామంలోకి నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. శాశ్వత పునరావాసం కల్పించకపోతే ప్రతీ వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో గుండేగాం గ్రామం ముంపు జాబితాలో చేరింది. ప్రభుత్వం ముంపు సర్వే పూర్తి చేసినప్పటికీ పునరావాస ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. వర్షాకాలం ప్రారంభమైతే గ్రామంలోకి నీరు చేరడం సాధారణమైంది. గతంలో అనేక సార్లు గ్రామ వీధులు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోని వస్తువులు దెబ్బతినడం, రాకపోకలు నిలిచిపోవడం, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సమస్యలు తరచూ ఎదురయ్యాయి.


