కొయ్యబొమ్మలే ఇవ్వండి..
ఇక జిల్లాకు పేరు తీసుకువచ్చిన కొయ్యబొమ్మలనూ కాపాడుకోవాలని సమావేశంలో ఇలంబర్తి సూచించారు. ప్రతీశాఖ వారు ఏ కార్యక్రమం జరిగినా కొయ్యబొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్‌నే జ్ఞాపికలుగా ఇవ్వడం ద్వారా కళాకారులకు, కళకు అండగా నిలిచినవారవుతారని తెలిపారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు బొమ్మలు, పెయింటింగ్స్ వెళ్లడం వల్ల ప్రమోషన్ చేసిన వాళ్లమవుతామని వివరించారు. తొలి కలెక్టర్ చెప్పిన ఈ మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రస్తుత కలెక్టర్ పేర్కొన్నారు.
నిర్మల్: ‘టీచర్స్ లేకపోతే మేము లేము. నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదివాను. సర్కారు బడిలో ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వబడులను ప్రోత్సహించాలి. అందులో చదువుచెప్పే ఉపాధ్యాయుల అనుభవం విద్యార్థులకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి. అలాగే ప్రతీ అధికారి ఓ ప్రభుత్వ బడిని బాధ్యతగా తీసుకోవాలి..’ అంటూ చదువు, ప్రభుత్వ బడి ప్రాధాన్యతను ప్రజాపాలన ప్రత్యేకాధికారి ఇలంబర్తి సూచించారు. ఈనెల 24న కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన చేసిన ఈ సూచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా తొలి కలెక్టర్ ఇలంబర్తి ఈ సమావేశంలో చేసిన పలు సూచనలు ఆలోచింపజేయడమే కాకుండా ఆచరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సర్కారు స్కూళ్లలో చదివి..
‘ఇక్కడ ఉన్నవాళ్లల్లో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివారో చెప్పండి..’అంటూ ప్రత్యేకాధికారి ఇలంబర్తి అడగగానే సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారుల్లో దాదా పు అందరూ చేతులెత్తారు. సర్కారు స్కూళ్లల్లో చది వి ఉన్నత అధికారులుగా ఎదిగిన తీరును ఆయన గర్వంగా చెప్పారు. అలాంటి స్కూళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు.
అధికారికో బడి అప్పగిస్తే..
‘అందరం ప్రభుత్వ బడుల్లో చదువుకుని వచ్చినవాళ్లమే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లమే. అందు కే ఒక్కో అధికారికి ఒక్కో బడి బాధ్యతను అప్పగిస్తే బాగుంటుంది. సదరు అధికారి నెలలో కనీసం రెండు మూడుసార్లు ఆ స్కూల్‌కు వెళ్లి, పిల్లలతో మాట్లాడాలి. వారిలో చదువుపై ఆసక్తిని పెంచడం, తాము ఏ శాఖలో, ఏఏ పనులు చేస్తామో చెప్పడం, సాధారణ కుటుంబాల నుంచి వచ్చినా, బాగా చదివితే తమలా ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని మోటివేట్ చేయాలి’ అని ఇలంబర్తి సూచించారు. దీనిపై కలెక్టర్ భవేశ్‌మిశ్రాతోపాటు జిల్లా అధికారులూ సానుకూలంగా స్పందించారు.


