నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతీఓటరు జూలై 24లోగా తమ వివరాలు నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని 29వ వార్డులో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారన్నారు. ప్రజలు ఫారాలను పూర్తిగా పూరించి, 2002 ఓటర్ల జాబితా లో తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నానమ్మ తదితర కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలన్నారు. అనంతరం సంతకం చేసి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటోను జతచేసి సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతీ ఓటరు ఓటు భద్రంగా ఉంటుందని, సమర్పించని వారి వివరాలు తదుపరి పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్‌వో సమక్షంలో కలెక్టర్ స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించారు. రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న వివరాలను నమోదు చేసి, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జతచేసి బీఎల్‌ఓకు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ రాజు, వార్డు సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, కాలనీ వాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


