భైంసా: జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కానరావడం లేదు. దీంతో ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. చిన్న వర్షానికే కాలనీల్లో మట్టిరోడ్లు బురదగా మారుతున్నాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడద కూడా పెరుగుతోంది.
అందకూర్‌లో అధ్వానం..
కుంటాల మండలం అందకూర్‌లో 57 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడగానే ఇళ్ల ముందు నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో కాలనీవాసులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోజూ ఇబ్బంది పడుతున్నారు.
నిర్మల్ పట్టణంలో..
జిల్లా కేంద్రం నిర్మల్‌లో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో లేవు. దీంతో కుటుంబాలు అనేక సమస్యల మధ్య జీవనం సాగిస్తున్నాయి.
ఖానాపూర్‌లో పంపిణీ ఆలస్యం..
ఖానాపూర్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. అర్హులైన కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ నిరాశకు గురవుతున్నాయి.
నిలిచిన నిర్మాణాలు..
కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచింది. భైంసా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీల్లో కూడా పూర్తిస్థాయి వసతులు లేవు. ముధోల్ మండల కేంద్రం నుంచి విట్టోలి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి.
ప్రజలు కోరుతున్న చర్యలు
జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. నిర్మించిన కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు అత్యవసరంగా కల్పించాలి. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నాణ్యమైన నివాస వాతావరణం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారం ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలపై సమగ్ర సమీక్ష జరిపి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


