చుక్కల మందుకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు వేళాయె

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

● నేడు పల్స్‌ పోలియో ● జిల్లాలో 92,116 మంది ఐదేళ్లలోపు పిల్లలు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమం కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిపోయిన చిన్నారులకు 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తారు. డీఎంహెచ్వో రాజేందర్‌ ఈ కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి ముందుగానే మార్గనిర్దేశం చేశారు. జిల్లాలో నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.

625 కేంద్రాలు, 20 మొబైల్‌ టీమ్స్‌..

జిల్లాలోని 17 మండలాల పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. పోలియో చుక్కల పంపిణీ కోసం 625 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితోపాటు 20 హైరిస్క్‌ కేంద్రాలు, 20 మొబైల్‌ టీమ్స్‌ కూడా సిద్ధం చేశారు.

విధుల్లో 2,500 మంది సిబ్బంది..

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొబైల్‌ టీమ్స్‌ ద్వారా బస్‌ స్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం 20 రూట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమ పర్యవేక్షణకు 70 మంది సూపర్వైజర్లను నియమించారు. జిల్లాలో సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.

నిర్లక్ష్యం వద్దు..

పిల్లలు భయంకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి టీకాలు వేయించడం తప్పనిసరి. పోలియో వ్యాధి రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పిల్లలకు చుక్కలు వేస్తారు.

తప్పనిసరిగా వేయించాలి

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో బారిన పడకుండా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు చేస్తారు. చిన్నారులు మిస్‌ కాకుండా చూసుకోవాలి.

– డాక్టరరాజేందర్‌ డీఎంహెచ్‌వో

జిల్లా వివరాలు..

5 ఏళ్లలోపు చిన్నారులు 92,116

మొత్తం బూత్‌లు 625

మొబైల్‌ టీమ్‌లు 20

ట్రాన్సిట్‌ పాయింట్లు 20

వ్యాక్సిన్‌ మేనేజర్లు 20

సూపర్‌వైజర్లు 70

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement