భైంసారూరల్: మండలంలోని లింగా–1 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాలుగేళ్లుగా మూతపడింది. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో 2022 నుంచి 2026 వరకు పాఠశాల తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను ఈఏడాది తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు లేక బడి కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ నియమితులైన ఉపాధ్యాయుడు సాయినాథ్ తీసుకున్న నిర్ణయం గ్రామస్తులను కదిలించింది. పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నాణ్యమైన భోజనం, యూనిఫాం, ఆంగ్ల బోధన అందించడంతోపాటు అదనంగా తనవంతుగా ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో ప్రాధాన్యతను వివరించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడి తపన, మాటతీరుతో నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ముందుకువస్తున్నారు. తనకు వచ్చే వేతనం నుంచి ఒక్క విద్యార్థికి ఇచ్చినమాట ప్రకారం ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు. ఈక్రమంలో ఒక్కొక్కరుగా లింగా బడిలో మళ్లీ పిల్లల సందడి పెరుగుతోంది.


