కట్టే పన్నులకు.. రోడ్డుకు సంబంధం లేదా? ఖానాపూర్‌లో నత్తనడకన రోడ్డు విస్తరణ అధికారులు, పాలకుల తీరుపై యువత ఆగ్రహం పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీల ఏర్పాటు
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే పనులు పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లయినా.. పనులు మళ్లీ ప్రారంభం కాలేదు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రధాన రహదారి కిలోమీటరుకుపైగా ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖానాపూర్‌లో ట్రాఫిక్ సమస్య పద్మవ్యూహంలా మారింది.
‘సోషల్’ వార్..
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పట్టణ వాసులు సోషల్ మీడియా ద్వారా పాలకులు, అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ‘‘మేమేం పాపం చేశాం? కట్టే పన్నులకు రోడ్డు సమస్యకు సంబంధం లేదా?’’ అని ముద్రించిన ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో స్కూల్ బస్సులు, అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ దిమ్మెలను కార్లు, డీసీఎంలు, ఇతర వాహనాలు ఢీకొన్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరసనలకు సన్నద్ధం..
రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఒక రోజు బంద్‌తోపాటు పట్టణ దిగ్బంధం, ఐదు వేల మంది సంతకాల సేకరణ, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది.


