భైంసా పీజీ హెచ్‌ఎం సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

భైంసా పీజీ హెచ్‌ఎం సస్పెన్షన్‌

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ

● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ

నిర్మల్‌: భైంసా పట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(పీజీహెచ్‌ఎం) ఎంఏ.అబ్దుల్‌ రషీద్‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌(ఆర్జేడీ) పి.మదన్‌మోహన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఈవో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతోపాటు ప్రభుత్వ నిధుల వినియోగంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. దీని ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావించిన సస్పెండ్‌ చేస్తున్నట్లు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

ప్రైవేట్‌కు పంపితే పథకాలు కట్‌

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని న్యూ పోచంపాడు గ్రామస్తులు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపమని గురువారం తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతామని ప్రకటించారు. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై చర్చించారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థిని కూడా ప్రైవేటు పాఠశాలకు పంపకూడదని నిర్ణయించారు. ఎవరైనా పంపితే వారికి రేషన్‌ బియ్యం, పెన్షన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని తీర్మానించారు. ఇందులో సర్పంచ్‌ కొండ పద్మ, శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ భూమేశ్‌, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

బొడ్డోనికుంట పరిశీలన

ఖానాపూర్‌: పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న బొడ్డోనికుంటను అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. అమృత్‌–2 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. కుంట సుందరీకరణతోపాటు ప్రజలకు ఉపయోగపడేలా వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తర్వాత కుంట సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బొడ్డోనికుంట అభివృద్ధితో శాంతినగర్‌ కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక, మున్సిపల్‌ కమిషనర్‌ సుందర్‌సింగ్‌, తహసీల్దార్‌ సుజాత పాల్గొన్నారు.

తొలకరికే రోడ్డెక్కిన వరద

ఖానాపూర్‌:పట్టణంలో గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికే వరద రోడ్డెక్కింది. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలు బహిర్గతమయ్యాయి. జిప్‌అడ్డా ప్రాంతంలో ఇరుకు డ్రైనేజీ కారణంగా.. వర్షపునీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి చేరింది. అటవీశాఖ కార్యాలయం ఎదుట డ్రైనేజీ లేకపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. తహసీల్దార్‌ కార్యాలయంలోకి వరద చేరింది. డ్రెయినేజీ మెరుగుపర్చకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పట్టణవాసులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement