లక్ష్మణచాంద: తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాలని పార్‌పల్లి గ్రామస్తులు డీఈవో భోజన్నకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలో గతేడాది 24 మంది విద్యార్థులు ఉండేవారని, ఈ ఏడాది కొత్తగా 28 మంది ప్రవేశం పొందారని తెలిపారు. మరో 70 మంది ప్రవేశాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 100 దాటుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోరని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో త్వరలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఉప సర్పంచ్ విద్యాసాగర్‌రెడ్డి, వార్డు సభ్యులు పోషగౌడ్, శ్రీనివాస్, గణేశ్, వీడీసీ సభ్యులు గంగాధర్, నారాయణ, భీమేష్, సుంకరి గంగాధర్, చిన్నయ్య ఉన్నారు.


