● జిల్లాలో 1,052మంది విద్యార్థుల చేరిక
నాణ్యమైన బోధన అందిస్తాం
జిల్లాలో నూతనంగా 74 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాం. 1,052 మంది విద్యార్థులు చేరారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రీ ప్రైమరీ తరగతులు పాఠశాలల్లో ప్రారంభించారు. అనుమతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకుంటాం – భోజన్న, డీఈవో
మామడ: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేక విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని విద్యాశాఖ గుర్తించింది. ఈ ఏడా ది నుంచి జిల్లాలో 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించింది. దీంతో పోషకులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,052 మంది పిల్లలు చేరారు.
గ్రామాల్లో స్వచ్ఛందంగా ఏర్పాటు
ఈ ఏడాది 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది 14 పాఠశాలలు ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో సొంత డబ్బులతో ప్రీ ప్రైమరీ తరగతిని షురూ చేశారు. మామడ మండలంలోని కమల్‌కోట్ ప్రాథమికోన్నత పాఠశాల, సారంగపూర్ మండలంలోని వైకుంఠపూర్ పాఠశాల, భైంసా మండలంలోని మంగ్రి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. వీడీసీ, సర్పంచుల ఆధ్వర్యంలో ఇన్‌స్ట్రక్టర్, ఆయాలను నియమించి ప్రతినెలా గౌరవవేత నం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ తరగతులను ఆయా గ్రామాల సర్పంచులు, మండల విద్యాధికారులు ప్రారంభించారు. దీంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.


