నిర్మల్‌చైన్‌గేట్: వ్యవసాయ సమాచారం, పథకాలు, సేవలను రైతులకు చేరువలో అందించేందుకు రైతు వేదికలు కీలకంగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి, ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని (ఏఈవో) నియమించారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించి, సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరల వివరాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నేటి నుంచి విత్తన మేళాలు..
మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని 22 రైతు వేదికల్లో ఒక్కో వేదికకు ఒక స్టాల్ చొప్పున మొత్తం 22 స్టాళ్లు నెలకొల్పుతారు. ఈ స్టాళ్లు వారం రోజులపాటు కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, విత్తన కంపెనీలు, స్థానిక విత్తన డీలర్ల సహకారంతో ఈ స్టాళ్లను నిర్వహిస్తారు. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, రవాణా భారం తగ్గుతుంది.
స్టాళ్లలో అందుబాటులో ఉండే వస్తువులు..
ప్రతీ రైతు వేదికలో ఏర్పాటు చేసే స్టాళ్లలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. వీటిలో బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్‌ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44 వంటి వరి విత్తనాలు, తణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెసర, కంది, మినుము, వేరుశెనగ, నువ్వులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు ఉంటాయి. అలాగే నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉంచుతారు. రైతులు నేరుగా స్టాళ్లను సందర్శించి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో మొత్తం 79 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో ఏఈవోలు రైతులకు అవసరమైన సేవలు అంది స్తున్నారు. జిల్లాలో సుమారు 1.98 లక్షల మంది రై తులు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రైతు భరోసా, రైతు బీమా, యంత్ర పరికరాలపై సబ్సిడీ పంపిణీ వంటి పథకాల అమలును రైతు వేదికల నుంచే నిర్వహిస్తారు. పంటల సాగులో మెలకువలు, వాతావరణ సూచనలపై సలహాలు కూడా ఇక్కడి సదస్సుల ద్వారా అందిస్తారు.
స్టాళ్లను సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో ఈనెల 23న 22 రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లను వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయనున్నాం. ఆయా స్టాళ్లలో రైతులకు అవసరమైన విత్తనాలతోపాటు ఎరువులు అందుబాటులో ఉంచుతాం. నేరుగా రైతులు సందర్శించి అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 79 రైతు వేదికల్లో కూడా ఈ సేవలు వారంలో అందుబాటులోకి తెస్తాం.
– అంజిప్రసాద్, ఏడీఏ, నిర్మల్
నేడు స్టాళ్లు ఏర్పాటు చేయనున్న
రైతు వేదికలు ఇవే..
మండలం రైతు వేదిక
భైంసా కామోల్
ఖానాపూర్ సత్తెనపల్లి
కడెం కడెం
పెంబి పెంబి
దస్తురాబాద్ దస్తురాబాద్
కుంటాల కుంటాల
ముధోల్ కారేగాం
నర్సాపూర్(జి) నర్సాపూర్(జి)
నిర్మల్ రూరల్ అక్కాపూర్
నిర్మల్ రూరల్ చిట్యాల్
తానూర్ తానూర్
మామడ మామడ
కుభీర్ కుభీర్
లోకేశ్వరం లోకేశ్వరం
నిర్మల్ అర్బన్ నిర్మల్ అర్బన్
సోన్ సోన్
లక్ష్మణచాంద లక్ష్మణచాంద
లక్ష్మణచాంద కనకాపూర్
సారంగాపూర్ సారంగాపూర్
సారంగాపూర్ పొన్కూర్
దిలావర్‌పూర్ దిలావర్‌పూర్
బాసర బాసర


