నిర్మల్: నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అని ఓ సినీకవి అప్పటి ఆస్పత్రుల పరిస్థితులను చూసి పాట రాశారు. అయితే ప్రస్తుతం ప్రైవేటులో ఖరీదైన వైద్యంతో మధ్య తరగతి వాళ్లు కూడా ప్రైవేటుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా సర్కారు దవాఖానాల్లో సౌకర్యాలు కల్పిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన నుంచి ప్రభుత్వాస్పత్రులు మెరుగవుతూ వస్తున్నాయి. అయితే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా పెద్దాస్పత్రిలోనే వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కలెక్టర్ స్వయంగా కంటి పరీక్షకు వెళ్లినప్పుడు కాలం చెల్లిన ఔషధం ఇవ్వబోయారు. జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు గతంలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన సైలెన్‌లు, సిరంజీలు బయటపడ్డాయి. దీంతో సాధారణ రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోగుల నమ్మకం, అధికారుల బాధ్యత
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు వచ్చేవారిలో ఎక్కు వ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలవారే. వా రు ‘పెద్ద ఆస్పత్రి దిక్కు’ అని నమ్ముకుని వస్తారు. వైద్యులు, సిబ్బంది మందులు పంపిణీ చేసే ముందు వాటి తయారీ తేదీ, గడువు తేదీని తప్పక పరిశీలించాలి. ఉన్నతాధికారులు కూడా నిల్వ, పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలి. ఈ ప్రాథమిక జాగ్రత్తలు పాటించక.. సర్కారు ఆస్పత్రులపై నమ్మకమే ఎక్స్‌పైరీ అవుతోంది.
ఎవరు బాధ్యులు..
చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు కాలం చెల్లిన మందులు ఇస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆస్పత్రి లేదా అవుట్‌పేషెంట్ విభాగంలో ఉన్న మందుల జాబితా, వాటి గడువు వివరాలు క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఔషధాల నిల్వ, పంపిణీలో సరైన పర్యవేక్షణ లోపించ డం, వైద్యులు కూడా వాటిని పరిశీలించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
పేషెంట్ల పరేషాన్..
ప్రభుత్వ దవాఖానాలను నమ్ముకుని వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. ‘డాక్టర్ ఇచ్చిన మందు కాబట్టి వాడుతున్నాం. అది కాలం చెల్లినదైతే మా ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. రోగులను ఇలా ఇబ్బంది పెట్టొద్దని, ఇప్పటికై నా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని వేడుకుంటున్నారు.
నాణ్యమైన వైద్యం, మందులు అందేలా..
జిల్లా జనరల్ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యసేవలు, మందులను అందిస్తున్నాం. ఇటీవల జరిగిన ఘటనకు కారణాలు తెలుసుకున్నాం. సదరు వైద్యుడిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాం. –డాక్టర్ గోపాల్‌సింగ్,
జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
కలెక్టర్ తనిఖీలు
జిల్లా జనరల్ ఆస్పత్రిని శనివారం కలెక్టర్ భవేశ్ మిశ్రా వెళ్లారు. వైద్యుడు కాలం చెల్లిన కంటి మందు వేయబోయాడు. కలెక్టర్ ఒకసారి పరిశీలించి ఎక్స్‌పైరీ అయినట్లు గుర్తించారు. వెంటనే వివరణ ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆస్పత్రిలోని అన్ని ఔషధాల కాలపరిమితి వివరాలను పూర్తిగా చెక్ చేయించారు. ఆ కాలం చెల్లిన మందు గతంలో పనిచేసిన ఓ వైద్యుడు తీసుకువచ్చినట్లు తేలింది. ప్రస్తుత వైద్యుడు దాని గడువు తేదీ చూసుకోలేదు. ఇది కూడా విధుల్లో నిర్లక్ష్యమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన వైద్యంతోపాటు మందులు అందిస్తేనే రోగుల్లో భరోసా పెరుగుతుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.


