లక్ష్మణచాంద:భూముల రీసర్వే, సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే తీరును సోమవారం పరిశీలించారు. ముందుగా మల్లాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలకు రెవెన్యూ మ్యాపులు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, రీసర్వేతో గ్రామాల రెవెన్యూ మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. అధునాతన కొలతల యంత్రాల సామగ్రిని ఉపయోగించి సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం మాచాపూర్, చామన్‌పెల్లి గ్రామాల్లో సర్వే తీరును పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. సర్వే తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ విఠల్‌రావు ఉన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నిర్మల్‌చైన్‌గేట్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో దశలో మంజూరైన ఇళ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇళ్లు, ఎంపీడీవో లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్‌కు పంపిన ఇళ్లు, ఇతర వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తెలిపారు. అనుమతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


