ఉద్యాన సాగు.. రైతుకు మేలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన సాగు.. రైతుకు మేలు

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

● రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం ● ఆసక్తి కనబరుస్తున్న రైతాంగం

లక్ష్మణచాంద: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తోంది. సబ్సిడీలు ఇస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తోంది. ఇదివరకు పామాయిల్‌ సాగు చేసిన రైతులకు మాత్రమే డ్రిప్‌ పరికరాలపై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మరిన్ని పంటలకూ సబ్సిడీ ఇస్తోంది. దీంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రాయితీలు పొందుతున్నారు.

పండ్ల తోటల సాగుకు ఇలా..

మామిడి సాగు చేసే రైతులకు ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 చొప్పున ఒక్కో రైతుకు 10ఎకరాల వరకు అందిస్తోంది. అరటి సాగు చేసే రైతుల కు మొదటి ఏడాది రూ.16,800, రెండో సంవత్స రం రూ.4వేలు ఇస్తోంది. బొప్పాయి సాగు చేసే రై తులకు మొదటి ఏడాది రూ.7,200, రెండో ఏడాది రూ.3,200 అందజేస్తోంది. జామ సాగు చేసే రైతులకు మొదటి ఏడాది రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 ఇస్తోంది. డ్రాగన్‌ ఫ్రూ ట్‌కు మొదటి ఏడాది రూ.64,800, రెండు, మూడో సంవత్సరాలకు రూ.12,800 చొప్పున చెల్లిస్తోంది.

కూరగాయలు, పూల సాగు, ఇతరాలకూ..

హైబ్రిడ్‌ కూరగాయల నారుకు రూ.9,600, ఉల్లికి రూ.8వేలు, విడి పూల (బంతి, చామంతి, కనకాంబరం, మల్లె) సాగుకు ఎకరాకు రూ.8వేలు ఇస్తోంది. దుంప జాతి పూల సాగుకు (ట్యూబ్‌రోజ్‌, గ్లాడియోలస్‌, లిల్లీ) ఎకరాకు రూ.40వేల చొప్పున ఐదెకరాల వరకు అందజేస్తోంది. అల్లం, వెల్లుల్లి, పసుపు పంటలకు ఎకరానికి రూ.16వేల చొప్పున ఐదెకరాల వరకు రాయితీ ఇస్తోంది. వీటితో పాటు సుగంధ ద్రవ్యాలు, మల్చింగ్‌ సాగు విధానం, నీటి కుంటలకూ సబ్సిడీ అందజేస్తోంది.

జిల్లాలో ఉద్యాన పంటల సాగు ఇలా..

సంవత్సరం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)

2021–22 1,283.88

2022–23 3,241.63

2023–24 1,875.88

2024–25 1,888.95

2025–26 3,904.88

సద్వినియోగం చేసుకోవాలి

గతంలో పామాయిల్‌ పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం మరిన్ని పంటలను రాయితీ జాబితాలోకి చేర్చి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌ లాంటి పండ్ల తోటలతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు రాయితీ ఇస్తోంది. ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయధికారులను లేదా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.

– మౌనిక, నిర్మల్‌ డివిజన్‌ ఉద్యాన,

పట్టు పరిశ్రమల అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement