నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యున్నత వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆన్‌లైన్ విధానంలో ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతోపాటు, ఏ విభాగాలకు ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని సందర్శించి, రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన వారికి తక్షణమే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. రోగుల సౌకర్యార్థం వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రతీ రికార్డును పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన ఆయన, ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శారద, వైద్య శాఖ అధికారులు ఉన్నారు.
రెవెన్యూ దరఖాస్తులు
గడువులోపు పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే అన్నిరకాల రెవెన్యూ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. మండలాలవారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి, సాదా బైనామా, ప్రజావాణి అర్జీలు, పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీ పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 60 రోజుల గడువు నిర్దేశించిందని, ఈలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పౌర సేవల కింద జారీ చేసే కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల దరఖాస్తులను సత్వరమే పరిశీలించి అర్హులైన వాటికి ఆమోదం తెలుపాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


