నిర్మల్‌టౌన్/భైంసాటౌన్/ఖానాపూర్: నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. నిర్మల్ కోర్టులో సివిల్ కేసులు 14, క్రిమినల్ కేసులు 1,599 పరిష్కారంకాగా, భైంసా కోర్టులో మొత్తం 610 కేసులు పరిష్కరించారు. వీటిలో 29 బ్యాంక్ సంబంధ కేసులకు సంబంధించి రూ.24,64,700 రికవరీకి ఆదేశించారు. ఇక ఖానాపూర్ కోర్టులో 439 కేసులు రాజీ కుదిర్చారు. జిల్లాలో ఒకే రోజు 2,636 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, భైంసా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆర్‌కె వెంకటరమణ, ఖానాపూర్‌లో జూనియర్ సివిల్ జడ్జి కమ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్ బీసీ నిఖిత ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.


