నిర్మల్‌టౌన్: క్రమ శిక్షణ, ఫిట్‌నెస్ పోలీసులకు చాలా కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో జిల్లాలోని సివిల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్‌డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ సిబ్బందికి ఫిజికల్ ఫిట్‌నెస్‌తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. సిబ్బందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి విధులను నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, గోవర్ధన్, కృష్ణ, ఏఆర్ ఇన్‌స్పెక్టర్లు రామ్ నిరంజన్, శేఖర్, రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


