తానూరు: వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. తానూరు పీహెచ్‌సీ, కస్తూరిబా పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీల నిర్వహణను శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిని సందర్శించి వైద్యుల వివరాలతోపాటు అందుబాటులో ఉన్న మందుల వివరాలను తెలుసుకున్నారు. ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్‌పై ఆరా తీశారు. కేజీబీవీని సందర్శించి వంట గదులతోపాటు విద్యార్థుల తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతిలో 40 మంది విద్యార్థులకు 27 మంది హాజరయ్యారు. పూర్తిస్థాయిలో వచ్చేలా చూడాలని ప్రిన్సిపాల్ అలేఖ్యకు సూచించారు. నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని స్కిల్స్ నేర్పించాలన్నారు. తర్వాత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీధర్, ఎంఈవో నరేందర్, వైద్యులు అజిత్, సిబ్బంది ఉన్నారు.


