ఎక్కడా కనిపించని ‘ఫ్రీ లెఫ్ట్’ ‘ఇరుకు’దారుల్లో ఇబ్బందులు కూడళ్లలో కూడా ఆక్రమణలు ఎమర్జెన్సీ సేవలకు అవరోధం రెడ్‌సిగ్నల్ పడ్డా ఆగని వైనం
నిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. ఆక్రమణల తొలగింపు అంతకన్నా లేదు. ఫ లితంగా ప్రధాన కూడళ్లూ పట్టణవాసులకు నిత్యం పరీక్ష పెడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎడమవైపు వెళ్లడానికి ఎక్కడా.. ‘ఫ్రీలెఫ్ట్’ రూట్ లేదు. ఎమర్జెన్సీలోనూ లెఫ్ట్‌వైపు వెళ్లాల్సిన వారూ గ్రీన్‌సిగ్నల్ వచ్చేదాకా వేచి చూస్తున్నారు. ఇక రెడ్‌సిగ్నల్ పడ్డా.. చాలామంది ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు. ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేకపోవడం, మున్సిపాలిటీలు పట్టణవాసులకు ఆటంకాలు లేని ప్రయాణానికి ఏర్పాట్లు చేయకపోవడం విడ్డూరమే.
ఫ్రస్టేషన్‌లో పట్టణవాసి..!
జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌరాస్తాలు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. రహదారులపై వ్యాపారులు, అక్రమ పార్కింగ్, తోపుడు బండ్లు, ఇతర ఆక్రమణల కారణంగా ఇరుకుగా మారాయి. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. నిత్యం ట్రాఫిక్ కష్టాలతో పట్టణవాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆఫీసులు, పాఠశాలలు, ఆస్పత్రులకు సమయానికి చేరుకోలేక పోతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ఆక్రమణలు, రోడ్లపై అస్తవ్యస్త పార్కింగ్, సిగ్నల్ ఉల్లంఘనలు వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. సమస్యలు చాలా ఏళ్లుగా ఉన్నా శాశ్వత పరిష్కారం లేక తీవ్ర ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఇటీవల సోషల్‌మీడియాలో అసహనా న్ని వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణపై మున్సిపాలిటీ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.


