బడి పిలుస్తోంది..! | - | Sakshi
Sakshi News home page

బడి పిలుస్తోంది..!

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

బాలల భవిష్యత్తు కోసం..

తొలి బాధ్యత తల్లిదండ్రులదే..

చదివించడమూ సామాజిక బాధ్యతే

విద్యతోనే జీవితంలో ఉన్నతస్థానం

నిర్మల్‌: ‘డియర్‌ స్టూడెంట్‌.. కమ్‌ టు మి..’ అంటూ స్కూల్‌ పిలుస్తోంది. ‘మీ బంగారు భవిష్యత్తుకు బడే పునాది..’ అని తరగతి గదిని చూపుతోంది. ‘చదువుంటే.. అన్నీ నీ వెంటే..’ అంటూ పుస్తకాలను చేతికిస్తోంది. నాలుగు గోడల మధ్య నవభారతాన్ని నిర్మించే గురువులను పరిచయం చేస్తోంది. ‘విద్యే విజయానికి చిరునామా..’ అంటూ చదువుతో పైకెదిగిన వాళ్లను చూపిస్తోంది. భావితరం బాగుండాలంటే వాళ్లు బడిబాట పట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజమూ బాధ్యత తీసుకోవాలని చెబుతోంది. కొత్త విద్యాసంవత్సరంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగు పెడదాం.. చదువులతల్లి కొలువైన జిల్లాను ఉన్నతంగా నిలుపుదాం రండి.. అంటూ బడి పిలుస్తోంది.

చదువే బంగారు బాట..

‘చదువుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం‘ అనే మాటకు నేటి సమాజమే ప్రత్యక్ష నిదర్శనం. సమాజానికి సేవ చేసే డాక్టర్లు, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ప్రతీరంగంలో రాణించేవారి ప్రయాణం తరగతి గది నుంచే మొదలైంది. చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు. మంచి వ్యక్తిత్వాన్ని, విలువలను, బాధ్యతలనూ నేర్పిస్తుంది.

తల్లిదండ్రులదే తొలి బాధ్యత

ప్రతీ చిన్నారి బడికి వెళ్లేలా చూడటం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, క్రమశిక్షణను అలవాటు చేయడం, పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించడం ద్వా రా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసినవాళ్లవుతారు. పిల్లలకు మొబైల్‌, టెలివిజన్‌ వినియోగా న్ని పరిమితం చేసి, చదువుకు అనుకూలమైన వా తావరణాన్ని కల్పించాలి. చదివే వయసులో పిల్లలు వేసే ప్రతీ అడుగు వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే మెట్టుగా మారుతుంది.

తీర్చిదిద్దేది గురువులే..

పిల్లలను రేపటి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపైనే ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి, క్రమశిక్షణ వంటి అంశాలను చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను చెడుమార్గాల వైపు వెళ్లకుండా చూడటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. గురువు చూపే దారి విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పగలదు.

సామాజిక బాధ్యత..

లక్ష్మణచాంద మండలానికి చెందిన ఓ చిన్నారి(మైనర్‌)కి తొమ్మిదో తరగతిలోనే కుటుంబసభ్యులు బా ల్యవివాహం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపారు. వెంటనే పెళ్లి ఆపేశారు. ఆ తర్వాత సదరు విద్యార్థిని ఉన్నతవిద్య చదువుకోవడమే కాకుండా జీవితంలోనూ గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. తన జీవితం బాగుండటానికి ఆరోజు బాల్యవివాహాన్ని ఆపిన సమాజమే కారణం. ప్రతీచిన్నారి పాఠశాల బాట పడితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలకు విద్యే శాశ్వత పరిష్కారం. అందుకే ‘ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలి.. ప్రతి కలకు చదువే బాట కావాలి‘ అనే సంకల్పంతో సమాజమూ స్పందించాల్సిన అవసరం ఉంది.

జిల్లా పాఠశాలల వివరాలు..

ప్రాథమిక 548

ప్రాథమికోన్నత 137

ఉన్నత 117

మొత్తం విద్యార్థులు 65,606

ఉపాధ్యాయులు 3,700

ప్రహరీ లేని పాఠశాలలు 181

మరుగుదొడ్లు లేనివి 216

కిచెన్‌ షెడ్‌లు లేనివి 230

తీర్చిదిద్దాల్సింది గురువులే..

చదువుతోనే ఉన్నతస్థానం..

జీవితంలో ఉన్నతస్థానంలో ఉండాలన్నా, ఉత్తమంగా జీవించాలన్నా అది చదువుతోనే సాధ్యం. ప్రతీ విద్యార్థి విద్య ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వం కల్పించే విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. – భవేశ్‌మిశ్రా, కలెక్టర్‌

విద్యతోనే గుర్తింపు..

సమాజంలో ఉత్తమ గుర్తింపు రావాలంటే ఉన్నత విద్యను అభ్యసించాలి. చదువుకున్న ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులు ఇష్టంతో చదువుకోవాలి. తల్లిదండ్రులూ పాజిటివ్‌గా పిల్లలను ప్రోత్సహించాలి. – డాక్టర్‌ జానకీషర్మిల, ఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement