భైంసాటౌన్: ఖరీఫ్ ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సకాలంలో వర్షాలు పడితే విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, రబీ సీజన్‌లో జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగుచేశారు. దిగుబడి సైతం బాగానే వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువ మొత్తంలో విక్రయించారు. అయితే, విక్రయించిన మక్కలకు సంబంధించి డబ్బులు సకాలంలో ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో సాగు ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు.
1.58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు..
జిల్లాలో ఈసారి 1.12 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్నలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఎకరాకు 26.5 క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించింది. దిగుబడి అధికంగా రావడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు గోదాముల కొరత అధికారులను వేధించింది. దీంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, పంట విక్రయించిన రైతులకు వారం రోజుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. కానీ, కొందరికి నెల రోజులు కావస్తున్నా డబ్బులు జమ కావడం లేదని రైతులు వాపోతున్నారు. త్వరగా డబ్బులు జమ చేస్తే సాగు ఖర్చులకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
వారం రోజుల్లో జమ..
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాం. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు రూ.107 కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో రూ.26 కోట్లు సోమవారం జమ చేస్తాం. మిగిలిన డబ్బులు సైతం వారంరోజుల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – మహేశ్ కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం
మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ఇలా..
సేకరించిన మక్కలు 1.58 లక్షల
మెట్రిక్ టన్నులు
పంట విక్రయించిన రైతులు : 20,977
సేకరించిన మొక్కజొన్న విలువ :
రూ.380.80 కోట్లు
ఇప్పటివరకు జమ చేసిన డబ్బులు
: రూ.107 కోట్లు
ఇంకా చెల్లించాల్సిన మొత్తం :
రూ.273.80 కోట్లు


