నిర్మల్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మే నెల వేతనం నుంచి1.5 శాతం ఈహెచ్‌ఎస్ చందా వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. వెంటనే అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
రేషనలైజేషన్ వార్తలపై ఆందోళన..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 30 లోపు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వస్తున్న వార్తలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 9 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, 60 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలని, ఆపైన ప్రతీ 20 మందికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులను వెంటనే సొంత జిల్లాల బదిలీలు చేయాలన్నారు. మిగిలిన స్పౌజ్ బదిలీలు పూర్తి చేయాలని కోరారు. జూలై 31 కట్‌ఆఫ్‌తో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, ప్రతీ మండలాన్ని రెండు క్లస్టర్లుగా విభజిస్తూ ఒక ఎంఈవో పోస్టును ప్రభుత్వ యాజమాన్యంలోని జీహెచ్‌ఎం– గ్రేడ్ 2 ద్వారా, మరొక ఎంఈవో పోస్టును లోకల్ బాడీ జీహెచ్‌ఎం–గ్రేడ్ 2 భర్తీ చేయాలని సూచించారు.
పీఆర్సీ ప్రకటించాలి..
జూన్ 30వ తేదీలోపు పీఆర్సీ ప్రకటించాలని లచ్చిరాం డిమాండ్ చేశారు. పాఠశాలల కుదింపు ఆలోచనను విరమించుకోవాలని, సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ ఖాన్, ఎ.లక్ష్మీప్రసాద్‌రెడ్డి, నోముల శరత్‌చందర్‌రెడ్డి, వట్టోలి ముత్తన్న, మేడారపు శ్రీనివాస్, ఎస్.పాండురంగాచారి, పోల ధర్మరాజ్ పాల్గొన్నారు.


