ఆదిలాబాద్: జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేర్చేలా ఆదిలాబాద్‌లో అత్యాధునిక ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పూర్తిస్థాయి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌తో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణశాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ‘ఓఎల్‌ఎస్ ఫీల్డ్ సర్వే’ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ మైదానం, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం 1,540 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 450 ఎకరాలు అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమి కోసం గతంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి చెందిన 700 ఎకరాలను సేకరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విమానాశ్రయంలో రక్షణ, పౌర అవసరాల కోసం 2.5 కిలోమీటర్ల మేర భారీ రన్‌వేను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుల సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, సర్వే నివేదికను మరో 20 రోజుల్లో కేంద్రా నికి అందజేస్తామని తెలిపారు. భూ సేకరణ వల్ల ప్రభావితమయ్యే నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే నష్టపరిహారం చెల్లింపులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, రవాణా పరంగా కొత్త పుంతలు తొక్కనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ సబర్వాల్, ఎస్.జి. ఇగ్లా, కల్నల్ నటరాజ్ వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


