లక్ష్మణచాంద: పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఆట పాటలతో కూడిన విద్యను అందించడంతోపాటు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శిశు మరణాల రేటును తగ్గించడంలో అంగన్‌వాడీ టీచర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కేంద్రాలకు వచ్చే సరుకులు, లబ్ధిదారుల వివరాలు, పౌష్టికాహార పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో సరైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు.
పాత ఫోన్లతో సాంకేతిక అవస్థలు
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందజేసింది. అయితే, వాటిలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తాయి. సిగ్నల్స్ అందకపోవడం, డేటా, నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఆన్‌లైన్ నమోదు పనులు నిలిచిపోయేవి. గతంలో అందించిన ఫోన్లలో అంగన్‌వాడీ సమాచార నమోదు యాప్‌లు డౌన్‌లోడ్ కాకపోవడం మరో సమస్యగా మారింది. బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉండటం, కొద్ది సమయం వినియోగించిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడంతో టీచర్లు వాటిని పక్కన పెట్టి, తమ సొంత ఫోన్లతోనే సమాచారం నమోదు చేస్తూ వస్తున్నారు.
జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు
జిల్లా పరిధిలో 19 మండలాలు, 400 గ్రామ పంచా యతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పరిధిలో భైంసా, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ ఐసీ డీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 931 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
పంపిణీకి సిద్ధం
జిల్లాలో మొత్తం 931 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, టీచర్లు పనిచేస్తున్న కేంద్రాలకు మాత్రమే ఈ మొబైల్ ఫోన్లు అందచేయనున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలకు పంపిణీ చేయడం లే దు. ఈ కొత్త ఫోన్లతో యాప్‌ల వినియోగం సులభతరం కావడంతోపాటు, డేటా నమోదు వేగవంతం కానుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరో గ్య పర్యవేక్షణ మరింత కచ్చితత్వంతో జరగనుంది.
త్వరలో పంపిణీ
నూతన ఫీచర్లు కలిగిన మొ బైల్ ఫోన్లు అంగన్‌వాడీ టీ చర్లకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు 881 మొబైల్ ఫోన్లు వచ్చా యి. వాటిని టీచర్లకు త్వరలోనే అందజ్‌స్తాం. ఈమేరకు చర్యలు చేపడుతున్నాం.
– వినూత్న, డీడబ్ల్యూవో
జిల్లాకు 881 కొత్త ఫోన్లు
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు నూతన ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. దీంతో నిర్మల్ జిల్లాకు మొత్తం 881 మొబైల్ ఫోన్లు వచ్చినట్లు జిల్లా డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడబ్ల్యూవో) వినూత్న తెలిపారు. ఇందులో 826 ఫోన్లు టీచర్లకు, ముగ్గురు బ్లాక్ కోఆర్డినేటర్లకు, మిగిలినవి ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు కేటా యించనున్నారు.


