నిర్మల్: ప్రపంచ చరిత్రలోనే ఒకేసారి ఒకేచెట్టుకు వెయ్యిమందిని ఉరితీసిన ఘటన లేదని, స్వతంత్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల గురించి ముందుతరాలకు తెలపాల్సిన బాధ్యత అందరిపై ఉందని డాక్టర్ కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ కావేరి గ్రంథాలయంలో గురువారం రాంజీగోండు స్మారక సమితి, డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాంజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ చక్రధారి మాట్లాడుతూ నిజాం, ఆంగ్లేయుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యిమంది త్యాగాలను భావితరాలకు తెలపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించడంతోపాటు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. ప్రముఖ వైద్యుడు, సాహితీవేత్త డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ వెయ్యిఉరుల మర్రి ఘటన పోరాటాన్ని తొలి తెలంగాణ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించాలన్నారు. సామాజికవేత్త డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ నిర్మల్ చరిత్ర పునర్నిర్మాణం అవసరమన్నారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు అమరుల త్యాగాలను పాట రూపంలో వివరించారు. రాంజీగోండు స్మారకసమితి కన్వీనర్ పోలీస్ భీమేశ్ గతంలో చేసిన వాగ్దానాల మేరకు రాంజీగోండు మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ మాట్లాడుతూ వెయ్యి ఉరులమర్రి ఘటనపై పరిశోధనలు చేసి, పాఠ్యాంశంగా తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ దీపక్, సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కిశోర్, రాజమణి, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
రాంజీ పోరాటం అజరామరం
జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన మహోన్నత పోరాట యోధు డు రాంజీగోండ్ అని, ఆయన పోరాటం అజరామరమని ఆదివాసీ హక్కుల పోరాటసమితి తుడుందెబ్బ, జేఏసీ జిల్లాకమిటీ నాయకులు కీర్తించారు. రాంజీగోండ్ విగ్రహం, వెయ్యిఉరుల మర్రి స్థూపం వద్ద నివాళులర్పించారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ నిర్మల్ గడ్డపై రాంజీగోండు సాగించిన పోరాటం, త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నిర్మల్‌లో రాంజీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, వెయ్యి ఉరులమర్రి ప్రాంతాన్ని స్మారకకేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమాల్లో జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి తొడుసం గోవర్ధన్, నాయకులు మొసలి చిన్నయ్య, సూరత్ సాయన్న, బోసాని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


