
హెల్మెట్ భారం కాదు.. భద్రత!
● చిన్నపారి నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ● నిబంధనలు పట్టించుకోని వాహనదారులు ● రాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత
నిర్మల్‌టౌన్: ఉరుకులు, పరుగుల జీవన గమనంలో వేగం కోసం పరుగెత్తే ప్రయత్నంలో భద్రతను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది భారీ మూల్యం చెల్లిస్తున్నారు. చిన్నపాటి అజాగ్రత్తతో నిండు ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, గాయాలయ్యే సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తప్పించవచ్చని రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే గమ్యానికి త్వరగా చేరాలనే ఆతృతలో హెల్మెట్ ధరించడాన్ని వాహనదారులు విస్మరిస్తున్నారు.
ప్రమాదాలకు ప్రధాన కారణం
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 85 శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.
నామమాత్రపు తనిఖీలు..
పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెల్మెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
చట్టం ఇలా..
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129, 177 ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది. పదేపదే హెల్మెట్ లేకుండా జరిమానా పడిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది.
రవాణా శాఖ హెచ్చరిక
రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిరాకరిస్తున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధ రించకపోవడం వల్ల తమకు, తమ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతీ వాహనదారుడు ని యమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
నాణ్యమైన హెల్మెట్‌తో భద్రత..
నాసిరకం హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించలేం. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రాప్ గడ్డం కింద సౌకర్యవంతంగా ఉండేలా, తలకు సరిగ్గా సరిపోయేలా ఎంపిక చేసుకోవాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లను ధరించాలని రవాణా శాఖ సూచిస్తోంది. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో తలకు గాయాల తీవ్రత 98 శాతం వరకు తగ్గుతుంది. అదనంగా, దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.
హెల్మెట్ తప్పనిసరి..
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహన చట్టం కింద జరిమానా విధించడంతోపాటు, వాహనం సీజ్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడగలుగుతాం. – దుర్గాప్రసాద్,
రవాణా శాఖ అధికారి
తలకు గాయం.. ప్రాణాంతకం
చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. టూ వీలర్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదాల సమయంలో 80 శాతం వరకు బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బీఎల్‌ఎన్.రెడ్డి,
న్యూరో ఫిజీషియన్, నిర్మల్

హెల్మెట్ భారం కాదు.. భద్రత!

హెల్మెట్ భారం కాదు.. భద్రత!