శారీరకంగా ఒక్కటయ్యారు.. గర్భం దాల్చడంతో..

Young Woman in Front of Husbands House is Worried at Tiruvallur - Sakshi

సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): తాళి కట్టిన గంటలోనే తనను నడిరోడ్డుపై వదిలేశాడని..తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మెయ్యూరు గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె లక్ష్మి(23) నర్సింగ్‌ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన అదే గ్రామానికి చెందిన చిన్నరాజ్‌(26) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చిన్నరాజ్‌ నమ్మించడంతో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత డిసెంబర్‌లో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించారు. వడమధురైకి చెందిన వేరే యువతితో చిన్నరాజ్‌కు పెళ్లి సంబంధం కుదుర్చారు.

విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధామిచ్చాడు. దీంతో డిసెంబర్‌ 18న ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్‌ చేసి పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది జనవరి 8న ఊత్తుకోటలోని చర్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళతానంటూ ఊత్తుకోట దాటిన తరువాత లక్ష్మిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెలన్నర తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి రావడంతో లక్ష్మి అతడి ఇంటికి వెళ్లింది.

తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన చిన్నరాజ్‌ బంధువులు యువతిపై దాడి చేసి ఇంటి లోపలికి రానివ్వకుండా తాళం వేశారు. దీంతో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతికి ఐద్వా సంఘం నేతలు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఊత్తుకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top