మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడికి కొత్త చిక్కులు! | Why Abhishek Banerjee wife Rujir Face allegations | Sakshi
Sakshi News home page

మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడికి కొత్త చిక్కులు!

May 14 2026 6:33 PM | Updated on May 14 2026 7:48 PM

Why Abhishek Banerjee wife Rujir Face allegations

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోవ‌డంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీకి త‌ల‌నొప్పులు ఎక్కువ‌య్యాయి. సువేందు అధికారి.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే అభిషేక్ బెన‌ర్జీకి జ‌డ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారు. అంతేకాదు బీజేపీ స‌ర్కారు ఆదేశాల‌తో ఆయ‌న ఇంటి ముందు భ‌ద్ర‌త కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల‌ను కూడా తొల‌గించింది. తాజాగా అభిషేక్ బెన‌ర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెర‌పైకి వ‌చ్చింది.

బొగ్గు కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డుల‌ను క‌లిగివున్నార‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండ‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్ప‌డివుంటార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒక‌టి, రుజిరా న‌రులా పేరుతో మ‌రో పాన్‌కార్డు ఆమె క‌లిగివున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు రుజిరా ద్వంద్వ‌ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'న‌వ భార‌త్ టైమ్స్' నివేదించింది.

థాయ్‌లాండ్‌ పౌరసత్వం
రుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్‌ పౌరసత్వం కూడా ఉన్న‌ట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్‌ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెన‌ర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్‌లో స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ ఆమె థాయ్ పౌర‌స‌త్వం వ‌దులుకోలేద‌ని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవ‌డంతో ఆమె గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. ఆ స‌మ‌యంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజ‌కీయంగా ఎదిగే ద‌శ‌లో ఉన్నారు. అప్ప‌టికే ఆయ‌న ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. అభిషేక్‌, రుజిరా దంప‌తుల‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వేర్వేరు తండ్రుల పేర్లు.. వివాదం
థాయ్‌లాండ్‌లో ఉన్న‌ప్పుడు రుజిరా.. భారత సంతతికి చెందిన వ్యక్తిగా పీఐఓ (PIO) కార్డును కలిగి ఉన్నారు. ఇందులో ఆమె తండి పేరు నిపన్ నరులా అని ఉంది. అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకున్న తర్వాత ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం సమర్పించిన పత్రాలలో తన తండ్రి పేరును గురుచరణ్ అహుజాగా పేర్కొన్నారు. ఇది ఇప్పటికీ వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.

రుజిరాపై విచారణకు డిమాండ్‌
ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌ల నేప‌థ్‌యంలో రుజిరా బెనర్జీపై విచారణ జరపాలని సోషల్ మీడియాలో నెటిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. రుజిరాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల గురించి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈ నేప్య‌థంలో సువేందు అధికారి ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement