ఫరీదాబాద్: ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారు ఈ భూమ్మీద కాదు.. పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకొచ్చి కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఈరోజు(సోమవారం, నవంబర్ 17వ తేదీ) హరియాణాలోని ఫరిదాబాద్‌లో నార్తరన్ జోనల్ కౌన్సిల్(ఎన్‌జెడ్‌సీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఈ తరహా ఉగ్రచర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని దాని మూలాల నుండి నిర్మూలించడమనేది తమ సమిష్టి నిబద్ధత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క 'బలమైన రాష్ట్రాలు మాత్రమే బలమైన దేశాన్ని సృష్టిస్తాయి అనే దార్శనికతను చాటడంలో జోనల్ కౌన్సిల్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి రంగంలో జాతీయ పురోగతితో పాటు భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వంలో ప్రాంతీయ బలమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉంచితే, ఢిల్లీ పేలుళ్లలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ రోజు ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.


