కొడుకు ముందే క్రికెట్‌ బ్యాట్‌తో ప్రిన్సిపల్‌పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

Viral Video: కొడుకు ముందే క్రికెట్‌ బ్యాట్‌తో ప్రిన్సిపల్‌పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

Published Wed, May 25 2022 7:37 PM

Viral Video: Woman Beats Up Husband With Cricket Bat In Front of Son - Sakshi

గృహహింస.. ఈ పేరు వినగానే వేధింపులకు గురవుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. భర్తలు, అత్త మామలు, ఆడపడచుల చిత్ర​ హింసలకు ఎంతోమంది వివాహితలు బలవుతున్నారు. కానీ భార్య చేతిలో గృహహింసకు గురవుతున్న భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట అల్వార్‌ జిల్లాలో నివాసముంటున్నారు. కాగా అజిత్‌ సింగ్‌ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్‌ తరుచూ అజిత్‌సింగ్‌పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్‌ సింగ్‌ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్‌ బ్యాట్‌, పాన్‌, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది.
చదవండి: అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం

అయితే గౌరవప్రదమైన టీచర్‌ వృత్తిలో ఉన్నందున భార్య వేధింపులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని బాధితుడు అజిత్‌ సింగ్‌ తెలిపాడు. కానీ ఇప్పుడామే హద్దులు దాటి ప్రవర్తిస్తుండటంతో  కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తన బావ భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేగాక భార్యపై తనెప్పుడూ  చేయి ఎత్తలేదని పేర్కొన్నాడు. తనొక ఉపాధ్యాయుడని..ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేదని అన్నాడు.

 
Advertisement
 
Advertisement