Sakshi News home page

Valentine's Day: మన ప్రేమలు ఏడు రకాలు!

Published Wed, Feb 14 2024 2:50 PM

Valentines day: What Is  Love And Its Types - Sakshi

ప్రేమంటే ఏమిటంటే..

ఒక వ్యక్తిపై మనకు కలిగే బలమైన ఉద్వేగ, మానసిక స్పందనే ప్రేమ. 

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరిని చూసినప్పుడు అందరికీ ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది. అది చాలా సహజం. 

మనిషి అనేకానేక అవసరాల మీదుగా స్వీయజ్ఞానం వరకూ సాగుతుందని ప్రఖ్యాత సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో అంటారు. 

మొదట బతకడానికి కావాల్సిన తిండి, నీరు, నిద్ర, ఆ తర్వాత రక్షణ అవసరాలు, ఆ తర్వాత ప్రేమావసరాలు. దానిపైన ఆత్మగౌరవం, స్వీయజ్ఞానం. అంటే ప్రేమ ప్రతి మనిషికీ తప్పని మానసికావసరం. 

అయితే మాస్లో ప్రకారం సెక్స్ తర్వాత ప్రేమ రావాలి. కానీ మన దేశంతోపాటు, చాలా సమాజాల్లో ప్రేమ తర్వాతే సెక్స్. 

ఇక ప్రేమ చుట్టూ ఎన్నెన్నో కథలు, కలలు, కవితలు. ప్రేమ చుట్టూ తీసిన సినిమాలెన్నో,  పాటలెన్నెన్నో. వీటన్నింటిని వింటూ, చూస్తూ, చదువుతూ పెరిగినవారిలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రేమ భావన పుట్టక మానదు. అది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చాలా కష్టం. 

ప్రేమకు హార్మోన్స్, ఫెర్మోన్స్ కారణమని బయాలజీ చెప్తుండగా… భావసారూప్యత, ఆకర్షణ కారణాలని సైకాలజీ చెబుతుంది. కాదుకాదు సోషల్ కండిషనింగ్ కారణమని సోషియాలజీ అంటుంది. 

మూలాలేవైతేనేం సెక్స్ ఎలా తప్పని శారీరకావసరమో, ప్రేమ కూడా అలాగే ఒక తప్పని మానసికావసరం. ఎవరికైనా అలాంటి అవసరం ఎప్పుడూ కలగలేదంటే వారి అవసరాన్ని అణచివేసేంత సోషల్, మోరల్ కండిషనింగ్ వారిపై జరిగిందని అర్థం. 

ప్రేమ సిద్ధాంతం..
ప్రేమ గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి. అందులో ప్రఖ్యాత సైకాలజిస్ట్ రాబర్ట్ స్టెర్నబర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎక్కువ ఆమోదం పొందింది. 

ప్రేమలో passion, intimacy, commitment అనే మూడు అంశాలు ఉంటాయంటాడు స్టెర్నబర్గ్. వాటి ఆధారంగా ఏడు రకాల ప్రేమలున్నాయంటాడు. 

ఇష్టం: కేవలం ఇంటిమసీ మాత్రమే ఉండేది. ఇది స్నేహితుల మధ్య కూడా ఉంటుంది.

వాంఛ: కేవలం ఒకరిపట్ల ఒకరికి ప్యాషన్ మాత్రమే ఉండేది. 

శూన్యప్రేమ: కేవలం నిబద్ధత మాత్రమే ఉండేది. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత కొన్ని జంటలకు మిగిలేదిదే. 

రొమాంటిక్ లవ్: ఒకరికి పట్ల ఒకరికి తీవ్రమైన ఇష్టం, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండేది. ఇందులో నిబద్ధత కనిపించదు. చాలామంది టీనేజ్ జంటల్లో కనిపించేది ఇలాంటి ప్రేమే. 

సహచర ప్రేమ: ఒకరిపట్ల ఒకరికి వాంఛ లోపించి.. కేవలం సాన్నిహిత్యం, నిబద్ధత మాత్రమే మిగిలిన ప్రేమ. పెళ్లయిన తర్వాత కొన్ని జంటల్లో మిగిలేది ఇలాంటి ప్రేమే.

మూఢప్రేమ: ఇద్దరిమధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేకపోయినా.. తీవ్రమైన భావావేశం, నిబద్ధత ఉండేది. 

సంపూర్ణ ప్రేమ: ఒకరిపట్ల మరొకరికి వాంఛ, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం, ఒకరిపట్ల మరొకరికి నిబద్ధత ఉండేది. ప్రేమించుకుంటున్నామనుకునే చాలా జంటల్లో అరుదుగా కనిపించే ప్రేమ. 

ఒకసారి ప్రేమ పుడితే, ప్రేమలో పడితే జీవితాంతం ఆ వ్యక్తినే ప్రేమిస్తారనే, ప్రేమించాలనే అపోహ మనలో చాలామందికి ఉంది. ప్రేమనేది ఒక noun అనుకోవడం వల్ల వచ్చే సమస్యిది.

కానీ ప్రేమ ఒక verb, అంటే ఒక ప్రక్రియ. ఒకసారి ప్రేమ పుట్టినా, ప్రేమలో పడ్డా.. దాన్ని నిలుపుకునేందుకు ఇద్దరూ నిరంతరం ప్రయత్నిస్తుండాల్సిందే. 

లేదంటే కొన్నాళ్లకు, కొన్నేళ్లకు ఒకరిపట్ల ఒకరికి passion దూరమై కేవలం సహచర ప్రేమ మాత్రమే మిగులుతుంది. 

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com

Advertisement

What’s your opinion

Advertisement