Uttarkashi tunnel collapse: శరవేగంగా డ్రిల్లింగ్‌

Uttarkashi tunnel collapse: Rat miners to begin manual drilling to help rescue 41 workers - Sakshi

 నిట్టనిలువుగా కొండపైన 36 మీటర్ల మేర డ్రిల్లింగ్‌

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండపై భాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగర్‌ డ్రిల్లింగ్‌ మెషీన్‌ తవ్వుతున్నపుడు రాడ్లు అడ్డుతగిలి మెషీన్‌ ధ్వంసమవడం తెల్సిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌ పైపు నుంచి డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేయనున్నారు.

ఏమిటీ ర్యాట్‌–హోల్‌ పద్ధతి?
మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్‌. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం.

చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఈ మార్గంలో ఇంకా 8.15 మీటర్లమేర బ్లేడ్ల ముక్కలను తొలగించాల్సిఉంది. ఆ తర్వాతే మ్యాన్యువల్‌ డ్రిల్లింగ్‌ మొదలవుతుంది. మరోవైపు, కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు.

రంగంలోకి ‘ర్యాట్‌–హోల్‌’ మైనింగ్‌ కార్మికులు
ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్‌–హోల్‌’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదలనున్నారు. ఇలా 12 మీటర్ల మేర  డిల్లింగ్‌ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్‌ రాజ్‌పుత్‌ తదితరులను ఈ పనికి పురమాయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top