ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యూపీ మంత్రివర్గ విస్తరణ

Uttar Pradesh CM Yogi Expands Cabinet, Includes Jitin Prasada - Sakshi

యోగి జట్టులోకి జితిన్‌ ప్రసాద

కొత్తగా ఏడుగురికి చోటు

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురిని కేబినెట్‌లో చేర్చుకున్నారు. వీరిలో ఒకరు బ్రాహ్మణ నాయకుడు కాగా, ముగ్గురు ఓబీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుడు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన బ్రాహ్మణ నేత జితిన్‌ ప్రసాదకు ఊహించినట్లుగానే కేబినెట్‌లో స్థానం దక్కింది. ఓబీసీ వర్గానికి చెందిన ఛత్రపాల్‌ గంగ్వార్‌ (ఎమ్మెల్యే), ధరంవీర్‌ ప్రజాపతి(ఎమ్మెల్సీ), డాక్టర్‌ సంగీతా బల్వంత్‌ బిండ్‌(ఎమ్మెల్యే), ఎస్సీ సామాజిక వర్గం నుంచి దినేష్‌ ఖతీక్‌(ఎమ్మెల్యే), పల్తూరామ్‌(ఎమ్మెల్యే), ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంజీవ్‌ కుమార్‌(ఎమ్మెల్యే) మంత్రులయ్యారు.  చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి)

బ్రాహ్మణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికేనా! 
ఉత్తరప్రదేశ్‌ ఓటర్లలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారు. రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి బలమైన మద్దతుదారులైన బ్రాహ్మణులు క్రమంగా బీజేపీ వైపు చేరిపోయారు. ఠాకూర్‌ సామాజికవర్గం నాయకుడైన సీఎం యోగి  పట్ల వారిలో అసంతృప్తి రగులుతోంది. యోగి ప్రభుత్వంలో తమను అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో పెరిగిపోతోంది. పరిస్థితిని గమనించిన బీజేపీ అధిష్టానం బ్రాహ్మణ వర్గాన్ని మంచి చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్‌ పార్టీలోని ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు, రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్‌ ప్రసాదపై వల విసిరింది. తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని హమీ ఇచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది జూన్‌లో బీజేపీలో చేరారు. అనుకున్నట్లుగానే మంత్రి పదవిని కట్టబెట్టింది. తద్వారా బ్రాహ్మణుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించే బాధ్యతను ఆయనపై మోపింది.   చదవండి:  (Punjab: 15 మందితో నూతన మంత్రి వర్గం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top