
మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి
ఆయుధాలు వదిలేస్తే ఒక తూటా కూడా పేల్చం
లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాం
అమిత్ షా స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరస్కరించారు. వారిపై దాడుల ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను నిలిపివేయాలని, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు 15 రోజుల క్రితం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు. వారు ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే కచ్చితంగా స్వాగతిస్తామని అన్నారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిపై భద్రతా బలగాలు ఒక్క తూటా కూడా పేల్చబోవని స్పష్టంచేశారు. మావోయిస్టుల ప్రతిపాదనపై అమిత్ షా మాట్లాడడం ఇదే మొదటిసారి.
ఆదివారం జరిగిన ‘నక్సల్ ముక్త్ భారత్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఆయుధం చేతపట్టిన తీవ్రవాదులపై కాల్పులు ఆపాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ఉండదని అన్నారు. నిజంగా లొంగిపోవాలని కోరుకుంటే కాల్పుల విరమణతో సంబంధం లేదని సూచించారు. ఇటీవలి కాలంలో మావోయిస్టుల పేరుతో రకరకాల లేఖలు విడుదల చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆక్షేపించారు. కాల్పుల విరమణతో సంబంధం లేకుండా లొంగిపోవచ్చని పేర్కొన్నారు. లొంగిపోయే మావోయిస్టులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని, ఆకర్శణీయమైన పునరావాస ప్యాకేజీ ఇస్తామని వెల్లడించారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న రెడ్ టెర్రర్
దేశంలో వామపక్ష తీవ్రవాదానికి కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతిక మద్దతు ఇస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. ప్రభుత్వాలు దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారంటూ కమ్యూనిస్టులు చేస్తున్న వాదనను ఖండించారు. నిజానికి మావోయిస్టుల హింసాకాండ కారణంగానే అభివృద్ధి ఫలాలు దేశంలో కొన్ని ప్రాంతాలకు దశాబ్దాలుగా చేరడం లేదని ఆరోపించారు.
అభివృద్ధిని రెడ్ టెర్రర్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. నక్సలైట్లు హత్యలు చేయకుండా, హింసకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటే నక్సలిజం అంతమవుతుందని కొందరు చెబుతున్నారని, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఉద్ఘాటించారు. సమాజంలోని వ్యక్తులు తెరపైకి తీసుకొచి్చన సిద్ధాంతం వల్లనే నక్సలిజం పెరిగిందని గుర్తుచేశారు.
నక్సల్స్ బాధితుల హక్కుల సంగతేమిటి?
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయుధాలతో అడవుల్లో సంచరిస్తున్న వ్యక్తులకు గిరిజనుల బతుకుల గురించి ఎలాంటి పట్టింపు లేదని ఆక్షేపించారు. దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన వామపక్ష సిద్ధాంతాన్ని బతికించుకోవడానికి మావోయిస్టులు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలంటూ సీపీఐ, సీపీఎం లేఖలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
నక్సల్స్ బాధితుల హక్కుల గురించి వీరు ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. 1960వ దశకం నుంచి వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి అమిత్ షా నివాళులరి్పంచారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి దాకా అంటూ నక్సలైట్లు జపం చేస్తున్నారని, అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. జమ్మూకశీ్మర్‌ను కాపాడాలన్న లక్ష్యంతో ఆరి్టకల్ 370ని రద్దుచేశామని, ఆ తర్వాత అక్కడ భద్రతా సిబ్బంది మరణాలు 65 శాతం, సాధారణ పౌరుల మరణాలు 77 శాతం తగ్గిపోయాయని అమిత్ షా స్పష్టంచేశారు.