ఇలానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్‌డౌన్‌: సీఎం

Uddhav Thackeray Lockdown If Cases Keep Rising For Next 15 Days - Sakshi

మహారాష్ట్ర ప్రజలను హెచ్చరించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

మంత్రి చాగన్‌ భుజ్బాల్‌కి కరోనా వైరస్‌ పాజిటివ్‌

ముంబై: గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. దాంతో జనాల్లో వైరస్‌ పట్ల భయం పూర్తిగా పోయింది. దీనికి తోడు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమం నడుస్తోంది. దాంతో జనాలు కరోనాను లైట్‌ తీసుకున్నారు. కానీ ఓ వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని యవత్మాల్, చంద్రపూర్, నాందేడ్, జిల్లాలతోపాటు నాగపూర్, అమరావతి జిల్లాలో  కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమరావతిలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా నాగపూర్‌లో గ్రామీణ  ప్రాంతాలలో పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే.. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే... ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మారో సారి లాక్‌డౌన్‌ విధించాలని మీరు కోరుకుంటున్నారా. మీరు ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. లాక్‌డౌన్‌ తప్పదు. వద్దనుకున్నవారు మాస్క్‌ ధరించండి.. లాక్‌డౌన్‌ కావాలి అనుకునే వారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ వల్ల అందరు ఇబ్బంది పడతారనే విషయం గుర్తించాలి’’ అన్నారు.

‘‘ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందా లేదా అన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే అమరావతి, అకోలా వంటి ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోయింది. దాంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించాం’’ అన్నారు. మహారాష్ట్రలో కొత్తగా ఆదివారం 6,281 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,93,913 కు చేరుకుంది.

మరో మహారాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌
మహారాష్ట్ర మంత్రి చాగన్‌ భుజ్బాల్‌కి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని..  గత కొద్ది రోజులుగా తనని కలిసిన వారందరు పరీక్షి చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి:
కరోనా విజృంభణ.. మరోసారి లాక్‌డౌన్‌!
ఆ కుటుంబానికి కరోనా మంచే చేసింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top