తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్‌ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం

Tribal Boy Bhaskar Halami From Maharashtra Now Scientist In US - Sakshi

ముంబై: కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు మహారాష్ట్రకు చెందిన భాస్కర్‌ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, తినేందుకు సరైన తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్‌ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్‌ హలామి.. ప్రస్తుతం అమెరికాలోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లోని రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్‌ ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్‌, పీహెచ్‌డీ కూడా పూర్తిచేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు.

తన చిన్న తనంలో తన కుటుంబం పడిన కష్టాలు, తినడానికి తిండి లేని రోజులను గుర్తు చేసుకున్నారు హలామి. ‘ ఒక్క పూట భోజనం కోసం చాలా ఇబ్బందులు పడ్డా. సరైన తిండి, పని దొరకని ఆనాటి రోజుల్లో ఎలా బతికామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతుంది. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లం. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లం. మా ఊరిలో 90 శాతం ప్రజల పరిస్థితి ఇదే’ అని తెలిపారు భాస్కర్‌ హలామి.

భాస్కర్‌ హలామీ తండ్రి ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకి చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్‌ గుర్తు చేసుకున్నారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్‌లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు.కొన్నాళ్లకు ఆ స్కూల్‌ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు.

భాస్కర్‌ 4వ తరగతి వరకు కసనూర్‌లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్‌లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్‌లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. గడ్చిరోలిలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్‌పూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్‌ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో పాస్‌ అయినప్పటికీ.. భాస్కర్‌కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్‌డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్‌ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు.

ఇదీ చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top