కొండచరియల బీభత్సం.. వందల మంది పర్యాటకులు విలవిల | Tourists Stranded After Multiple Landslides Hit Sikkim | Sakshi
Sakshi News home page

కొండచరియల బీభత్సం.. వందల మంది పర్యాటకులు విలవిల

Mar 25 2026 11:32 AM | Updated on Mar 25 2026 11:39 AM

Tourists Stranded After Multiple Landslides Hit Sikkim

గ్యాంగ్‌టక్: సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్‌థాంగ్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో సుమారు 200 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. కీలక చుంగ్‌థాంగ్-లాచెన్ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో లాచెన్‌కు వెళుతున్న పర్యాటకులు మార్గం మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. చిక్కుకుపోయిన పర్యాటకులకు చుంగ్‌థాంగ్‌లోని ఐటిబిపి (ఐటీబీపీ) క్యాంప్, స్థానిక గురుద్వారాలో  ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ)రంగంలోకి దిగి, రహదారిని క్లియర్ చేసే పనులను వేగవంతం చేసింది. అయితే వాతావరణం ఇంకా అనుకూలించకపోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రహదారులు ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిస్థితుల్లో కొంతమంది పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి మూసుకుపోయిన లాచుంగ్ మార్గాన్ని అధికారులు బుధవారం ఉదయం పునరుద్ధరించారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా గాంగ్‌టక్‌కు తరలించారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లాచెన్ మార్గం, మరమ్మతుల తర్వాత ఈ ఏడాది మార్చి 9నే తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మళ్లీ ప్రకృతి విపత్తు సంభవించడం పర్యాటక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

అటు తూర్పు సిక్కింలో కూడా భారీగా మంచు కురుస్తుండటంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలైన చోమ్గో సరస్సు, నాథులా పాస్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సమీపంలోని డార్జిలింగ్‌లో కూడా వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పర్యాటకులు వాతావరణ హెచ్చరికలను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement