రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
బిలాస్‌పూర్‌లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.
రెడ్ జోన్‌గా ఒక కిలోమీటర్ పరిధి
వైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్‌ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్‌లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.
మనుషులకు ముప్పు పొంచి ఉందా?
పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్‌కు మద్దతుగా..


