చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.
అందుకే ఈ నిర్ణయం
డీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.
స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానం
కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్‌ను కోరారు.
ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..
తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే!
இது தியாகம் அல்ல; கடமை.
சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026


