బేల్దార్‌.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి.. | TMC Rampurhat-1 block president Anarul Hossain about Sakshi Special Story | Sakshi
Sakshi News home page

బేల్దార్‌.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదిగి, ఏకంగా..

Published Sun, Mar 27 2022 6:35 AM | Last Updated on Sun, Mar 27 2022 2:08 PM

TMC Rampurhat-1 block president Anarul Hossain about Sakshi Special Story

తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదగడం సినిమాల్లో చూశాం!  బీర్‌భూమ్‌ ప్రధాన నిందితుడు అనరుల్‌ హుస్సేన్‌ కథ కూడా అలాంటిదే! చిన్న గుడిసెలో ఉండే బేల్దార్‌ అనరుల్‌ మూడంతస్తుల భవనంలో ఉండే దాదాగా మారిన తీరు అనూహ్యం. తానుండే ప్రాంతంలో చాలామందికి అనరుల్‌ ఒక దైవదూత. కానీ ఈ దైవదూత వెనుక చీకటి కోణాలు అనేకం. సజీవ దహనం కేసులో సీబీఐ అరెస్టు చేసేవరకు అనరుల్‌ను తాకడానికి స్థానిక పోలీసులు కూడా భయపడేవారు. ఆ ప్రాంతానికి అతను మకుటం లేని మహారాజు.

చిన్నతనంలో తండ్రితో కలిసి అనరుల్‌ తాపీ పనులకు వచ్చేవాడని, తర్వాత మేస్త్రీగా ఎదిగాడని స్థానికులు గుర్తు చేసుకుంటారు. అప్పటినుంచే ఏదో సాధించాలన్న కసి అతనిలో ఉండేదని అనరుల్‌ చిన్నప్పటి స్నేహితుడు స్వపన్‌ మండల్‌ చెప్పారు. లక్ష్యసాధన కోసం తొలుత అన్రుల్‌ కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం మమత నేతృత్వంలోని టీఎంసీలోకి వచ్చి రామ్‌పుర్హాత్‌ బ్లాక్‌1 ప్రెసిడెంట్‌ అయ్యాడు. సజీవ దహనం కేసు దర్యాప్తునకు పోలీసులు బోగ్‌తుయ్‌ ఊర్లోకి రాకుండా అనరుల్‌ అడ్డుకున్నాడంటే అతని పరపతి అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు చివరకు సీబీఐ చేతికి చిక్కాడు.

అవినీతి సోపానాలు
అనరుల్‌ హుస్సేన్‌ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలున్నాయని, స్థానికంగా నర్సరీ నడిపే కార్తీక్‌ మండల్‌ చెప్పారు. పలు సంవత్సరాలుగా అనరుల్‌ అక్రమ సంపాదన కొనసాగిందన్నారు. ‘‘ఆయన ఇల్లు చూడండి. ఒక మేస్త్రీ ఇల్లులాగా ఉందా అది? గడిచిన రెండు దశాబ్దాల్లో అతను ఇంత శక్తిని, ఆస్తిని కూడబెట్టాడు. నిజాయితీపరుడెవరూ స్వల్పకాలంలో ఇంత కూడబెట్టలేడు’’ అని కార్తీక్‌ వ్యాఖ్యానించారు. తన స్థలాన్ని కబ్జా చేసి మరీ అనరుల్‌ ఇల్లు కట్టాడని ఆరోపించారు. స్థానిక ఎంఎల్‌ఏ, అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్‌ ఆశిష్‌ బెనర్జీకి హుస్సేన్‌ చాలా ఆప్తుడని పుకార్లున్నాయి. మంచి పనివంతుడని అనరుల్‌కు పార్టీలో పేరుందని స్థానిక నాయకులు చెప్పారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనరుల్‌కు అడ్డం లేకుండా పోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, స్థానిక సిండికేట్‌ నిర్వహణ తదితరాల్లో అనరుల్‌ హస్తం ఉంది. 2019లో అతన్ని బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా తొలగించాలని స్థానిక నేత భావించినా, ఎంఎల్‌ఏ అండతో గండం తప్పించుకున్నాడు.  

ఈర్ష్యతో ఆరోపణలు
తన తండ్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అనరుల్‌ కుమార్తె ముంతాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరిన పనల్లా ఆయన చేశాడని, అందుకు ప్రతిగా ఆయనపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన చెందా రు. అయితే అనరుల్‌ లాంటివాళ్లు టీఎంసీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం ఇతనొక్కడే బయటపడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆశిష్‌ కింద చాలామంది అనరుల్‌ హుస్సేన్‌ లాంటి వాళ్లున్నారన్నారు. టీఎంసీ పాలనలో ఇలాంటి బాహుబలులు చాలామంది పుట్టుకువచ్చారని దుయ్యబట్టారు. వీరంతా స్థానిక సామంతరాజులని విమర్శించారు. ప్రస్తుతం అనరుల్‌ను పోలీసు కస్టడీలో ఉంచారు. ఇకపై ఆయన్ను సీబీఐ విచారించనుంది.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement