ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్‌ హీరోలా సంపాదిస్తాడేమో.. | TMC MLA house in Shibpur Howrah district West Bengal | Sakshi
Sakshi News home page

ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్‌ హీరోలా సంపాదిస్తాడేమో..

May 14 2026 7:24 PM | Updated on May 14 2026 8:06 PM

TMC MLA house in Shibpur Howrah district West Bengal

హౌరా: పశ్చిమ బెంగాల్‌ శిబ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్‌లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.

శిబ్‌పూర్ కేసులో, హెచ్‌ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్‌కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.

ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్‌రూమ్ ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని  బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.

కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్‌మెంట్‌లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు.  అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement