
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈకేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీం కోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాం«దీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లంటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేపాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు.