బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అత్యధిక శాతం ఓట్లు సాధించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ పోలైయ్యాయి. ఎన్నికల సంఘం అధికార వెబ్‌సైట్ తాజా డేటా ప్రకారం.. ఆర్జేడీకి 22.75 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 20.67, జేడీయూ 18.89 శాతం ఓట్లు సాధించాయి. బీజేపీతో పోలిస్తే ఆర్జేడీకి 2.08 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. జేడీయూ కంటే తేజస్వీ పార్టీ 3.86 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది.
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో 143 స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేసింది. బీజేపీ- జేడీయూ చెరో 121 స్థానాల్లో బరిలోకి దిగాయి. 28 స్థానాల్లో అభ్యర్థులను నిలిపిన ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి (రామ్ విలాస్) 5.03 శాతం ఓట్లు దక్కించుకుంది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీకి 23.11 శాతం ఓట్లు వచ్చాయి. 19.46 శాతం ఓట్లతో బీజేపీ 74 స్థానాలు దక్కించుకుంది. జేడీయూ 15.39 శాతం ఓట్లు తెచ్చుకుని 43 స్థానాలను సొంతం చేసుకుంది. 9.48 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమికి 37 శాతం, మహాగఠ్‌బంధన్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి.
తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఇప్పుడు 27 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 48 సీట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి 17 స్థానాలు జమ అయ్యాయి. జేడీయూ కూడా బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి ఏకంగా 35 స్థానాలు అదనంగా సాధించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. హస్తం పార్టీ 14 స్థానాలను కోల్పోయింది. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 1.19, జేడీయూ 3.5 శాతం అదనంగా ఓట్లు దక్కించుకున్నాయి.

చదవండి: నితీశ్ కుమార్ నియోజకవర్గం ఏదీ?


