బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగురవేసింది. డబుల్ సెంచరీతో మహాగఠ్‌బంధన్‌పై విజయ దుందుభి మోగించింది. ఎన్డీఏ ధాటికి ప్రతిపక్ష కూటమి కకావికలం అయింది. కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేక కుదేలయింది. కొత్తగా వచ్చిన జన సురాజ్ పార్టీకి ఖాతా కూడా తెరలేకపోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై బిహార్ ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారు. అఖండ మెజారిటీతో ఆయనకు మద్దతు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే శాసనసభ ఎన్నికల్లోనూ రావడంతో నితీశ్ కుమార్ ప్రాభవం శిఖరాలకు చేరింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆసక్తికరమైన టాపిక్ గూగుల్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. నితీశ్ కుమార్ నియోజకవర్గం (Nitish kumar Constituency). ఆయన నియోజకవర్గం గురించి గూగుల్‌లో జనం విపరీతంగా వెతికేశారు. దీనికి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్ 100K వరకు ఉందని గూగుల్ ట్రెండ్స్ ద్వారా వెల్లడైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే నితీశ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. చాలా ఏళ్లుగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
నితీశ్ కుమార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 40 ఏళ్లు అవుతోంది. 1985లో హర్నాట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మళ్లీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989- 2004 మధ్య కాలంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు అటల్ బిహారి వాజపేయి కేబినెట్‌లో పలు కీలక శాఖలు నిర్వహించారు.
చదవండి: తేజస్వీకి చెమటలు పట్టించాడు.. ఎవరీ సతీశ్?
వీరి గురించి తెగ వెతికారు
బిహార్ ఎన్నికల సంబంధించి పలు అంశాలు శుక్రవారం మధ్యాహ్నం గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాయి. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ నియోజకవర్గాల గురించి ఎక్కవగా నెటిజనులు శోధించారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్, గాయకుడు ఖేసరీలాల్ యాదవ్ (Khesarilal Yadav) ఎన్నికల ఫలితం గురించి జనాలు ఆసక్తి కనబరిచారు. చప్రా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చోటీ కుమారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రఖ్యాత జానపద గాయని మైథిలి ఠాకూర్ (Maithili Thakur) ఎన్నికల ఫలితం గురించి కూడా ఆన్‌లైన్‌లో తెగ వెతికారు.
బిహార్ ఎన్నికల ట్రెండింగ్ టాపిక్స్
1. నితీశ్ కుమార్ నియోజకవర్గం
2. తేజస్వీ యాదవ్ నియోజకవర్గం
3. తేజ్ ప్రతాప్ యాదవ్ నియోజకవర్గం
4. ఖేసరీలాల్
5. చప్రా విధానసభ ఫలితం 2025
6. మైథిలా ఠాకూర్ ఎన్నికల ఫలితం
7. పవన్ సింగ్
8. అనంత్ సింగ్


