బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించబోతోంది. మెజారిటీ స్థానాలను ఎన్డీఏ దక్కించుకోబోతోందని ఎన్నికల ఫలితాల సరళి బట్టి స్పష్టమవుతోంది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ముఖ్యనేత తేజస్వీ యాదవ్ వెనుకబడినట్టు తాజా సమాచారం. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్ (Raghopur) నుంచి బరిలోకి దిగారు తేజస్వీ.
ఓట్ల లెక్కింపు మొదలవగానే తేజస్వీ ఆధిక్యంలోకి వచ్చారు. కొన్ని రౌండ్ల వరకు ఆయన హవా కనిపించింది. కానీ ఒక దశలో ఆయన వెనుబడ్డారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. తేజస్వీపై 3 వేల పై చిలుకు ఆధిక్యం సాధించారు. దీంతో ఒక్కసారిగా మీడియా ఫోకస్ మొత్తం రఘోపూర్‌పై నిలిచింది.
అయితే తర్వాత తేజస్వీ మెల్లగా పుంజుకోవడంలో మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో 129 ఓట్ల స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. కాసేపటికే సతీశ్ కుమార్ 343 ఓట్లతో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఒంటి గంట ప్రాంతంలో తేజస్వీ 585 ఓట్ల ఆధిక్యంతో తిరిగి పుంజుకున్నారు. మ. 1.40 గంటల సమయానికి 2288 ఓట్లతో సతీశ్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. మ. 2 గంటలకు 3230 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ. 2.30 గంటలకు 4829 మెజారిటీలో ఉన్నారు. అంతకంతకూ ఆయన మెజారిటీ పెరుగుతోంది. మ. 3 గంటలకు 4570 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రబ్డీదేవిని ఓడించిన సతీశ్ కుమార్
తేజస్వీకి చెమట పట్టించిన 59 ఏళ్ల సతీశ్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ఇదే స్థానంలో తేజస్వీ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవిని ఓడించి సంచలనం సృష్టించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆర్జేడీ పార్టీ నుంచే ఆయన బీజేపీలోకి వెళ్లారు. 1995 నుంచి రఘోపూర్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది. 2010 ఎన్నికల్లో సతీశ్ కుమార్.. లాలూ కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన లాలూ సతీమణి రబ్డీదేవిపై 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సన్సేషన్ క్రియేట్ చేశారు.
తేజస్వీకి టెన్షన్
తాజా ఎన్నికల విషయానికి వస్తే రెండుసార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీ యాదవ్‌ను కూడా సతీశ్ కుమార్ టెన్షన్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్‌లో తేజస్వీ ఓడిపోతే అంతకన్నా అవమానం మరోటి ఉండదు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పరాజయం పాలైతే మహాగఠ్‌బంధన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ముఖ్యంగా లాలూ కుటుంబం రాజకీయ ప్రతిష్ట మరింత బలహీనమవుతుంది.
చదవండి: పార్టీల వారీగా ఎన్నికల ఫలితాలు ఇవే


