
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగమవుతోంది
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సమన్ల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
హైకోర్టు తీర్పును సవాల్‌చేసిన కేంద్రాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
ఈడీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూకేటాయింపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇలాంటి విపరీత పోకడ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకండి. ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశ మంతటా అమలు చేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. – సుప్రీంకోర్టు
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూకేటాయింపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్నవేసింది. ముడా భూకేటాయింపుల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి వ్యతిరేకంగా ఈడీ గతంలో జారీచేసిన సమన్లు కొట్టేస్తూ కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఈడీ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. అచ్చం ఇలాగే మహారాష్ట్రలో జరిగిన ఉదంతం మొత్తం మాకు తెలుసు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?. ఇలాంటి విపరీత పోకడ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తిచేయకండి.
ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశమంతటా అమలుచేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఈ యుద్ధాల్లోకి ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసుల విషయంలో ఈడీ అధికారులు అన్ని పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
స్వాగతించిన కాంగ్రెస్.. విమర్శించిన బీజేపీ
ఈడీ వైఖరిని ఎండగడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈడీ–బీజేపీ సమష్టిగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సుప్రీంకోర్టు బట్టబయలుచేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. కోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి చెంపదెబ్బలా తగిలిందని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
ఈడీని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు ఈ తీర్పు మేలుకొలుపు అని ఆయన అన్నారు. ముడా కేసులో తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టంచేసింది. ‘‘ భూమికి బదులు ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరగకపోతే వాటిని సీఎం కుటుంబం ఎందుకు మళ్లీ వెనక్కి ఇచ్చేసింది?. వాటిని వాళ్ల వద్దే ఉంచుకోవచ్చుగదా. ఈ అంశంలో మా పోరాటం కొనసాగుతుంది’’అని కర్ణాటక అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్.అశోక్ సోమవారం బెంగళూరులో అన్నారు.
ఏమిటీ ముడా కేసు?
సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది.
అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.
అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి.