Agnipath Scheme Protests: అగ్నిపథ్‌ ఆందోళనలపై ఆస్పత్రి నుంచే సోనియా లేఖ.. హింస వద్దని పిలుపు

Sonia Gandhi Open Letter To Agnipath Protesters - Sakshi

సాక్షి, ఢిల్లీ: నిరసన ప్రదర్శనలుగా మొదలై హింసాత్మక మలుపు తీసుకున్నాయి అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనలు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది కూడా. ఈ తరుణంలో నిరసనకారుల వెన్నంటే ఉంటామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఓ లేఖ విడుదల చేశారు.  

‘‘అగ్నిపథ్‌కు ఒక దిశానిర్దేశం అంటూ లేదు. మీ గొంతుకను కేంద్రం పట్టించుకోవట్లేదు. చాలా మంది మాజీ సైనికాధికారులు కూడా కొత్త పథకం గురించి ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తారు. కేంద్రం దగ్గర సమాధానం లేదు. నిరసనకారులు.. అహింసాయుత పద్ధతుల్లో నిరసన తెలియజేయండి. ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది’’ అంటూ సోనియా పేరిట లేఖ విడుదల చేశారు పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌. 

కరోనాతో ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో ప్రస్తుతం సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. ‘‘పథకానికి వ్యతిరేకంగా మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న వాగ్దానానికి.. భారత జాతీయ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. నిజమైన దేశభక్తితో హింసకు తావులేకుండా సహనంతో మీ తరపున మా గొంతుకను వినిపిస్తాం.. మీరూ అహింసా మార్గంలోనే నిరసనలు చేపట్టండి.. అంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంటే.. ఎనిమిది రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక ఆందోళనల్లో ఒకరు(తెలంగాణ వరంగల్‌ నుంచి రాకేష్‌) కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. యూపీ, బీహార్‌ నుంచి మొత్తం 600 మంది నిరసనకారుల్ని అరెస్ట్‌ చేశారు ఆయా రాష్ట్రాల పోలీసులు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top