
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది.
కాగా, కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్‌లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.

దీర్ఘకాల సెలవులు రద్దు
ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు.