ఇదే చివరిసారి.. గణేశ్‌ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి

SC Allows Ganesha Idols Immersion In Hyderabads Hussainsagar Lake - Sakshi

పీవోపీ నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి 

నిమజ్జనానికి అనుమతి ఇచ్చినప్పుడు సుందరీకరణ చేపట్టడం ఎందుకు? 

దీనివల్ల సొమ్ములు దుబారా 

జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్య  

సాక్షి, న్యూఢిల్లీ: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అదికూడా ఈ ఏడాది నిమజ్జనానికే అను మతి ఇస్తున్నామని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలకు ఇదే చివరి అవకాశమని, ఇది పునరావృతం కారాదని తేల్చిచెప్పింది. హుస్సేన్‌సాగర్, చిన్నచిన్న ఇతరత్రా చెరువుల్లో పీఓపీతో చేసిన వినాయక ప్రతిమల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్‌ హిమాకోహ్లి ఉన్నప్పటికీ గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశంలో ఆదేశాలు ఇచ్చిన కారణంగా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం కాలేనని చెప్పారు. చదవండి: 2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు

తరచూ ఈ సమస్య వస్తోంది... 
తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణ కాలుష్యం కానీయబోమని చెప్పారు. ప్రతిమ నిమజ్జనం ఒక క్రేన్‌తో చేస్తామని, వెంటనే మరో క్రేన్‌తో వాటిని బయటకు తీసి ఘనవ్యర్థాల నిర్వహణ నిమిత్తం తరలించి రీసైక్లింగ్‌ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయబోమని నివేదించారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ సమస్య హైదరాబాద్‌లో తరచూ వస్తూ ఉంటుంది. కోర్టు అనేక మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్నింటినీ పాటించడం లేదు. ఏటా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. అది కాలుష్యానికి కారణమవుతోంది. సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు పరిగణనలోకి తీసుకుంటే పీవోపీ ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలను తీసేస్తామని అంటున్నారు. ఈ దిశగా నిమజ్జనం రోజున కార్యక్రమాలపై హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఇదే చివరి అవకాశం’అని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  చదవండి: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు

చివరి నిమిషంలో వస్తారు..
‘హుస్సేన్‌సాగర్‌ పరిశుభ్రతకు ఏటా ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్న విషయం మీకు (తుషార్‌ మెహతా) తెలియదు. ఏటా నిమజ్జనానికి అనుమతినిస్తే సుందరీకరణ కోసం వెచ్చించడం ఎందుకు? దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. చివరి నిమిషంలో వస్తారు. అసలు ఏం జరుగుతోంది’అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. ఇకపై సమర్థవంతంగా ప్రణాళిక చేపడతామని అఫిడవిట్‌లో హామీ ఇచ్చామని, వేడుకల మధ్య తలెత్తిన సమస్యలకు ఓ పరిష్కారం గుర్తించామని తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సమయంలో హైకోర్టులో పిటిషన్‌దారు వేణుమాధవ్‌ అభిప్రాయాన్ని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అడిగారు. 2005 నుంచి పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నానని వేణుమాధవ్‌ తెలిపారు.

‘క్రమశిక్షణ, ప్రజల మద్దతు ఎంతో అవసరం. లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఈ సరస్సుకు వెళ్లు ఆ సరస్సుకి వెళ్లు అని చెప్పడం సాధ్యమేనా? ప్రజలు వారంతట వారే వస్తారు. భారీ ప్రతిమలు అనుమతించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీవోపీ నిషేధానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తిగా లేం. చివరి నిమిషంలో అసాధ్యమైన వాటిని అమలు చేయాలని మేం ఆదేశించలేం. ఈ ఏడాదికి మాత్రం అనుమతి ఇస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా కోర్టు ఆదేశాలు పాటిస్తామని 
తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలి’అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్‌ ఫిర్యాదులోని ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకోబోమని వాటిని హైకోర్టు పరిష్కరిస్తుందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top